Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 42

Story of Sagara 5 ( contd )!

కాలధర్మం గతే రామ సగరే ప్రకృతీ జనాః |
రాజానం రోచయామాసుః అంశుమంతం సుధార్మికమ్ ||

'ఓ రామా ! సగరుడు కాలధర్మము చేసిన తరువాత జనులందరూ ధార్మికుడైన అంశుమంతుడు రాజు కావలెనని కోరుకొనిర".

బాలకాండ
నలుబదిరెండవ సర్గము
( భగీరథ ప్రయత్నము)

విశ్వామిత్రుడు మరల సగరుని కథ చెప్పసాగెను.

'ఓ రామా ! సగరుడు కాలధర్మము చేసిన తరువాత జనులందరూ ధార్మికుడైన అంశుమంతుడు రాజు కావలెనని కోరుకొనిరి. ఓ రఘునందన ! అంశుమంతుడు రాజు అయ్యెను. అతనియొక్క పుత్రుడు దిలీపుడు గూడా రాజు అయ్యెనని ప్రసిద్ధి. ఓ రఘునందన ! ఆ దిలీపునిమీద రాజ్యభారము వేసి అంసుమంతుడు హిమవత్ శిఖరములలో దారుణమైన తపస్సు గావించెను. ముప్పదిరెండువేల సంవత్సరములు తపోవనమునకు వెళ్ళిన తరువాత ఆ తపోధనుడు స్వర్గస్తుడు అయ్యెను'.

'దిలీప మహరాజు కూడా పితామహుల వధా వృత్తాంతము విని దుఃఖితుడాయెను కాని ఏమీ నిశ్చయము చేయలేకపోయెను. "గంగను ఏటుల తీసుకురావలెను ? వారికి తర్పణములు ఏట్లు విడవవలెను? వారికి ఏట్లు ముక్తి కలుగును" , అని చింతాగ్రస్తుడు అయ్యెను. నిత్యము ధర్మకార్యములు చేయుచూ అత్మనుగురించి తెలిసినవాడై భగీరథుడను పుత్రుని పొందెను. ఆ దిలీప మహారాజు యజ్ఞకార్యములపై ఇష్ఠము కలవాడు. అతడు ముప్పది వేల సంవత్సరములు రాజ్యము చేసెను. ఓ నరశార్దూల ! తన పితామహుల ఉద్ధారణ కోసము ఏమియూ నిశ్చయము చేయకుండా ( దిలీపమహరాజు) కాలధర్మము చెందెను. ఓ నరర్షభ ! రాజ్యమునకు భగీరథును పట్టాభిషేకము చేసి , ఆ మహరాజు తను సంపాదించిన కర్మతో ఇంద్రలోకము పొందెను'.

' ఓ రఘునందనా! భగీరథుడు ధార్మికుడు, రాజర్షి కాని సంతానము లేని వాడు అయ్యెను. ఆ మహారాజు పుత్రులపై కోరికగలవాడు కాని పుత్రులు లేనివాడు. ఆ రాజ్యము మంత్రులకు ఇచ్చి గంగా అవతీర్ణముకోసము గోకర్ణములో ఘోరమైన తపస్సు చేసెను. ఇంద్రియములను జయించినవాడు , బాహువులను పైకెత్తి, మాసములో ఒకసారి ఆహరము తీసుకొంటూ, పంచాగ్నులమధ్య ఘోరమైన తపస్సు వెయ్య సంవత్సరములు చేసెను. మహాత్ముడు మాహాబాహువూ అయిన ఆ రాజుయొక్క అతీతమైన తపస్సుచే సృష్ఠికర్త అయిన బ్రహ్మ మిక్కిలి ప్రీతిచెందెను. అట్లు ప్రీతి చెందిన బ్రహ్మ ఆప్పుడు దేవగణములతో సహ వచ్చి ఇట్లు పలికెను.

"ఓ మహాభాగా ! జనేశ్వరా ! భగీరథా ! తీవ్రమైన నీ తపస్సుచే సంతోషపడితిని. ఓ సువ్రతా వరమును కోరుకొనుము .

మహాతేజస్సుగల భగీరథుడు కృతాంజలి ఘటించి సర్వలోకములకు పితామహుడైన బ్రహ్మతో ఇట్లుపలికెను.

" హే భగవన్ నాతపస్సుతో తృప్తి చెందినచో ఆ తపో ఫలముగా సగరాత్మజులందరికీ జలములుఅందుగాక. ఆ మహాత్ముల భస్మములు గంగాజలములచేత తడిసిన పిమ్మట మా పితామహులందరూ స్వర్గము పొందుదురు. ఓ దేవా ! మా కులము ఉండదు , ఇక్ష్వాకు కులములో సంతతి ప్రసాదింపుము. ఇది నా ఇంకొక కోరిక" .

ఈ విధముగా చెప్పబడిన భగీరథుని మాటలకు మధురముగా మధురాక్షరములతో బ్రహ్మ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. " మహారథ భగీరథ ! నీ మనోరథము ఉత్తమమైనది. ఇక్ష్వాకు కులము వర్థిల్లుని. నీకు శుభమగును. హిమవంతుని జ్యేష్ఠపుత్రిక గంగ . ఆమెను ధరించు శక్తి శివునకే గలదు. కనుక ఆయనను ఆశ్రయించవలెను. ఓ రాజన్ గంగా ప్రవాహమునకు భూమి తట్టుకొనలేదు. ఓ వీరా ! ఆమెను భరించుటకు ఇంకో శక్తిమంతుడు నాకు కనపడుటలేదు".

ఈ విధముగా ఆ రాజునకు చెప్పి , గంగకు కూడా లొకహితము చెప్పి దేవతలతోనూ మరుద్గణములతో కూడి బ్రహ్మదేవుడు తిరిగివెళ్ళెను.

|| ఈ విధముగా ఆదికావ్యమైన శ్రీమద్వాల్మీకి రామాయణములోని బాలకాండలో నలుబదిరెండవ సర్గ సమాప్తము ||.

||ఓమ్ తత్ సత్ ||

తమేవముక్త్వా రాజానం గంగాం చాభాష్య లోకకృత్ |
జగామ త్రిదివం దేవస్సహ దేవైః మరుద్గణైః ||

తా|| ఈ విధముగా ఆ రాజునకు చెప్పి , గంగకు కూడా లొకహితము చెప్పి దేవతలతోనూ మరుద్గణములతో కూడి బ్రహ్మదేవుడు తిరిగివెళ్ళెను.

|| ఓమ్ తత్ సత్ ||



|| Om tat sat ||